ఆర్బీఐ మరో కొత్త కార్యక్రమం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాణేలు కావాలనుకునేవారి కోసం కాయిన్ వెండింగ్ మెషిన్లను తీసుకొస్తోంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మెషిన్ల నుంచి నాణేలను పొందొచ్చు. దేశంలోని 12 నగరాల్లో తొలుత ఈ వెండింగ్ మెషిన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం నగదును తీసుకునేందుకు ఏ విధంగానైతే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో, నోట్లకు బదులు నాణేలు కావాలనుకునేవారికి ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మెషిన్లలో స్క్రీన్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కావాల్సిన నాణేలను పొందొచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు.






