Rahul Gandhi: 2024 ఎన్నికల్లో అక్రమాల వల్లే మోడీ గెలిచారు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 70 నుండి 100 స్థానాల్లో అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందో త్వరలోనే ఆధారాలతో సహా నిరూపిస్తామని తెలిపారు. మోడీ కేవలం స్వల్ప మెజారిటీతో ప్రధాని అయ్యారని, 10 నుంచి 15 స్థానాల్లో అక్రమాలు జరగకపోతే ఆయన (PM Modi) ప్రధాని అయ్యేవారు కాదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఉనికిలో లేకుండా పోయేంత బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఇవి అణుబాంబు వేసినంత ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఈ ఆధారాలను కనుగొనడానికి తమకు ఆరు నెలల సమయం పట్టిందని, త్వరలోనే వాటిని బయటపెడతామని అన్నారు. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కోటి మంది కొత్త ఓటర్లు చేరారని, ఇందుకు సంబంధించిన రుజువులు తమ వద్ద ఉన్నాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.