Kashmir: పహల్గాం ఉగ్రదాడి వెనక టీఆర్ఎఫ్.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎలా ఏర్పడింది..?

పాక్‌కు చెందిన లష్కరే ముసుగు సంస్థ టీఆర్‌ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్).. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి వెనక ఉన్ట్లు ప్రకటించుకుంది. ఈ దాడితో ఒక్కసారిగా ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్.. పాపులర్ అయిపోయింది. ఇంతకూ ఈ టీఆర్ఎఫ్ ఎలా ఏర్పడింది..? వివరాల్లోకి వెళ్తే…నియామకాల విషయంలో టీఆర్ఎఫ్ (TRF)…చాలా పక్కాగా వ్యవహరిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. లష్కరే కోర్ గ్రూప్ నుంచి టీఆర్‌ఎఫ్‌లోకి నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ సంస్థ రోజువారీ వలస కూలీలు, పౌరులను లక్ష్యంగా చేసుకొని హఠాత్తుగా దాడులు చేసేది. అంతేకాదు.. 2021 శ్రీనగర్ వాయుసేన స్థావరంపై జరిపిన జంట డ్రోన్ల దాడుల వెనక కూడా ఇదే సంస్థ హస్తం ఉంది.
2020 నుంచి పౌరులపై జరిపిన దాడుల వెనుక దీని పాత్ర ఉంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్‌ను కూడా టీఆర్‌ఎఫ్ బెదిరించింది. స్థానికుల్లో, కశ్మీర్ సందర్శకుల్లో భయం పెంచడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఇది నేరుగా భద్రతాదళాలతో తలపడదు. కేవలం హిట్ అండ్ రన్ (దాడి చేసి పారిపోవడం) వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇక టీఆర్‌ఎఫ్ కమాండర్ సజ్జాద్ గుల్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఈ సంస్థకు క్షేత్రస్థాయిలో ఉండే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకొని దాడులు చేయగలుగుతోంది. కశ్మీర్‌లో స్థానికేతరుల హత్యలపై ఇన్వెస్టిగేషన్ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి టీఆర్‌ఎఫ్‌కు సంబంధించిన కీలక పరికరాలు, ఇతర వస్తువులు లభించాయి. క్షేత్ర స్థాయిలో వారు టీఆర్‌ఎఫ్ సభ్యులకు ఆశ్రయం ఇవ్వడం, ఆహారం సమకూర్చడం, ఇతర సరకులు చేర్చడం వంటివి చేస్తుంటారు.