గౌతమ్ అదానీకి షాక్ ఇచ్చిన ముఖేశ్ అంబానీ
భారత కుబేరుల జాబితాలో తొలి స్థానం కోసం రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పోటీపడుతున్నారు. భారత కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగిన అంబానీని కొన్ని నెలల క్రితం అదానీ వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు అనూహ్యంగా రాణించడమే అందుకు కారణం. తాజాగా అదానీని అంబానీ వెనక్కి నెట్టారు. దీంతో భారత్‌తో పాటు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ 99.7 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 2022లో ఆయన సంపద 9.69 బిలియన్ డాలర్లు ఎగబాకింది. అదే జాబితాలో అదానీ 98.7 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. భారత కుబేరుల జాబితాలో వీరివురు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.






