Arvind Kejriwal: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు.. హామీలు నెరవేర్చలేదంటూ కొందరు మహిళలు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆందోళన చేశారు.
ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేజ్రీవాల్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావాలనే తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి తమను టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. తన ఇంటి ముందు నిరసనకు దిగిన మహిళలు కూడా ఆ పార్టీలకు చెందిన వారేనని, వాళ్లు పంజాబ్ నుంచి రాలేదని కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. పంజాబ్‌లో ప్రజల మద్దతు తమకే ఉందన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆప్‌పై పోటీ చేస్తున్నాయని ప్రకటించాలని డిమాండ్ చేశారు.