Pahalgam: ఉగ్రవాదంపై కశ్మీరీల ఆగ్రహం.. ఆరేళ్ల తర్వాత తొలిసారి బంద్…

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిపై కశ్మీరీల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో శ్రీనగర్ సహా స్థానికంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ (Bandh) పాటించారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఉగ్ర చర్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనగర్ సహా అనేక చోట్ల బంద్ పాటించారు. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీశారని ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇటీవలి కాలంలో దుకాణాలు మూతపడటం ఇదే తొలిసారి. ఆగస్టు 2019కు ముందు ఇక్కడ ఇటువంటివి సర్వసాధారణం కాగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, గత ఆరేళ్లలో కశ్మీర్‌లో బంద్ పాటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాజా ఘటనతో కశ్మీరీలు సిగ్గుతో తల దించుకుంటున్నారని అన్నారు. అటు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా లాల్‌చౌక్ సెంటర్‌లో (Jammu Kashmir News) నిరసన కార్యక్రమం చేపట్టింది.
దాడికి పాల్పడినవారు జమ్మూ కశ్మీర్ ప్రజల మేలు కోరే వారు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహ్‌దీ పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెడుతామన్నారు.
‘‘ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకూడదు. కశ్మీర్ పేరుతో, ఏదైనా వర్గం పేరుతో ఇలాంటివి మరోసారి జరగకూడదు. అమాయకుల ప్రాణాలు తీయడం అంటే మొత్తం మానవాళినే చంపడంతో సమానం’’ అని హజీ బాషిర్ అహ్మద్ అనే శ్రీనగర్ వాసి మీడియాతో పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా ఉగ్రవాద మూలాలను పెకిలివేసేలా చర్యలు చేపట్టాలని స్థానిక పండ్ల వ్యాపారి జీఎం బాండే పేర్కొన్నాడు. కశ్మీరీ ప్రజలు ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమేనన్నాడు. అయితే, కశ్మీరీ సమాజాన్ని కించపరచడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామన్నారు.
ప్రపంచానికి సందేశం చాటేందుకే..
ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారాలో నిరసనలు చేపట్టారు. ఉగ్ర చర్యకు వ్యతిరేకంగా దక్షిణ కశ్మీర్‌లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. 2016లో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ హతమైన తర్వాత ఇదే విధంగా స్థానికులు వీధుల్లోకి వచ్చారు. కశ్మీరీలు ఉగ్రవాదంతో లేరనే సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే ఈ నిరసనలు చేస్తున్నామని, పర్యాటకులపై దాడిని ఖండిస్తున్నామని స్థానిక సామాజిక కార్యకర్త తౌసీఫ్ అహ్మద్ పేర్కొన్నారు.