Kashmir: కశ్మీర్ పర్యాటకానికి గడ్డురోజులు.. పహల్గాం ఘటనతో సగానికి పడిపోయిన పర్యాటకులు…!
 
                                    పహల్గాం బైసరన్ మైదానంలో ఉగ్రదాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ దాడితోనే ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. పాకిస్తాన్ పుట్టలో దాక్కున్న ఉగ్రనాగుల్ని .. భారత సైన్యం ఏరివేసింది కూడా. అయితే.. ఈఘటన కశ్మీర్ (Kashmir) ప్రజలకు మాత్రం ఆశనిపాతమైంది. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో కశ్మీర్ పర్యాటకం పెరుగుతోంది. దేశ ప్రజలు కూడా స్వేచ్ఛగా కశ్మీర్ అందాల్ని తిలకించేందుకు వెళ్తున్నారు.ఈ తరుణంలో ఉగ్రదాడి.. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. దీంతో కశ్మీర్ పర్యటనలకు సగం మంది భారతీయులు దూరమయ్యారని చెప్పక తప్పదు.
కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ మైదానంలో పర్యాటకులపై ఘోర ఉగ్రదాడి ఘటన జరిగి ఆరు నెలలు పూర్తయింది. ఈ దాడిలో అత్యధికులు పర్యాటకులే కాగా, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయానక ఘటన ప్రభావం నుంచి కశ్మీర్ పర్యాటక రంగం ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తారని ఆశించిన ఈ ఏడాది, అనూహ్యంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది.
ఉగ్రదాడి జరిగిన వెంటనే వేలాది మంది పర్యాటకులు భయంతో కశ్మీర్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే శ్రీనగర్‌కు రావాల్సిన 15,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఆగస్టు నెల కోసం చేసుకున్న సుమారు 13 లక్షల బుకింగ్‌లు కూడా రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అప్పటి నుంచి ప్రభుత్వం, టూర్ ఆపరేటర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్యాటకుల రాక మెరుగుపడలేదు.
2025 మొదటి ఆరు నెలల్లో కశ్మీర్‌ను 7,53,856 మంది పర్యాటకులు సందర్శించారు. వీరిలో 15,319 మంది విదేశీయులు కాగా, 7,38,537 మంది దేశీయ పర్యాటకులు. అయితే, 2024లో ఇదే సమయానికి 15,65,851 మంది పర్యాటకులు లోయను సందర్శించారు. గతేడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్య ఏకంగా 52 శాతం పడిపోయింది. ఈ సంక్షోభం కారణంగా పర్యాటక రంగంపై ఆధారపడిన ఎన్నో వ్యాపారాలు మూతపడే స్థితికి చేరుకున్నాయి.











 
                                                     
                                                        