Jai shankar-Rahul: రాహుల్ చైనా గురు.. విదేశాంగమంత్రి జైశంకర్ వ్యంగ్య సంబోధన..

ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ, లోక్ సభ విపక్షనేత రాహుల్.. వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ (Modi) సమాధానమివ్వడం లేదని.. నేరుగానే విమర్శిస్తున్నారు రాహుల్. ఎందుకు వాటికి సమాధానమివ్వడం లేదో చెప్పాలని పబ్లిగ్గా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ. ఇప్పుడు వాటికి తగినట్లుగా కేంద్రమంత్రులు కూడా రాహుల్ (Rahul Gandhi) ను టార్గెట్ చేశారు. రాహుల్ చైనా గురు అంటూ విదేశాంగమంత్రి జైశంకర్ (Jai Shankar) సెటైర్ వేశారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘‘నేను చైనా గురు కాను. అందుకే ఇటీవలి నా పర్యటనలో అక్కడ ఎవరితోనూ రహస్యంగా సమావేశం కాలేదు.. గోప్యంగా ఒప్పందాలూ కుదుర్చుకోలేదు. ఉగ్రవాదం, ఉద్రిక్తతలు, వాణిజ్యం, ఉభయదేశాలకు ఆసక్తి ఉండే ఇతర అంశాలపైనే చర్చించాను. మనదగ్గర ఒక చైనా గురు ఉన్నారు. ఆయనకు ఆ దేశంపై ఎంతో ప్రేమ. ఇరు దేశాలకు సంబంధించి ఆయనొక ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిపేరు చిండియా (చైనా+ఇండియా). నా చైనా పర్యటనలో కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. ఎందుకంటే నేను చైనా (బీజింగ్) ఒలింపిక్స్‌కు వెళ్లి ఎవరిచేతా పాఠాలు చెప్పించుకోలేదు. నన్నెవరూ దానికి పిలవలేదు. ఎందుకంటే నేను ప్రత్యేక వ్యక్తిని కాను. ఒకరు మాత్రం ఆ ఒలింపిక్స్‌కు వెళ్లి జ్ఞానం పొందారు. వారు అక్కడ చైనావాళ్లనే కాదు.. వేరేవారినీ కలిశారు. ఒలింపిక్స్ క్లాస్‌రూంలో నిద్రపోవడం వల్ల ఆయన నేర్చుకోవాల్సినవి కొన్ని మిగిలిపోయాయేమో. అందుకే చైనా రాయబారిని ఇంటికి ఆహ్వానించి మరోసారి ట్యూషన్ చెప్పించుకున్నారు. చైనావల్ల మన దేశానికి యూపీఏ పాలనలో ఏయే రూపాల్లో నష్టం వాటిల్లిందో ఆ గురు గుర్తెరగాలి’’ అని జైశంకర్ హితవు పలికారు.
పాక్‌తో పోరు విరమణలో వేరే దేశం జోక్యం గానీ, వాణిజ్య సంబంధం గానీ లేదని తేల్చిచెప్పారు జైశంకర్. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా ఇప్పుడు మన దేశంలో ఉగ్రదాడికి ప్రతిదాడి అదేరోజు ఉంటుందని స్పష్టంచేశారు. పహల్గాంలో తమవారి తలలపై గురిపెట్టి ఉగ్రవాదులు ఎలా కాల్చారో వారికీ అదే గతి పట్టించాలని బాధిత కుటుంబాలవారు సహా అనేకమంది కోరుకున్నారని, ఆపరేషన్ మహాదేవ్‌లో ముష్కరుల తలలను ఆ రీతిలోనే లేపేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజ్యసభలో చర్చకు ఆయన సమాధానమిచ్చారు.