Glass Bridge: దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన ప్రారంభం.. ఎక్కడ ఉందో తెలుసా?

బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెన (Glass Bridge )ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Chief Minister Stalin) ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారి(Kanyakumari)లో సముద్రం మధ్యన వివేకానంద(Vivekananda) స్మారక మండపం ఉంది. దీనికి సమీపంలో 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 133 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేసి 25 ఏళ్లు అవుతున్నందున సిల్వర్‌జూబ్లీ వేడుకలు 2025 జనవరి 1న ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన 77 మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో రూ.37 కోట్ల వ్యయంతో గాజు వంతెన నిర్మించారు. వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువర్ విగ్రహానికి పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు. ఇంతకుముందు ఇలా చేరుకోవడానికి పడవ రవాణా మాత్రమే ఉండేది. ఏడాదిగా జరుగుతున్న వంతెన నిర్మాణం పూర్తవడంతో ముఖ్యమంత్రి ప్రారంభించారు.