Pahalgam: పహల్గాం దాడితో పాక్ అప్రమత్తం… కీలక స్థావరాల్లో యుద్ధవిమానాల మోహరింపు?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత్ ఎలా స్పందించనుంది..? ఉరీ(URI) దాడుల తర్వాత చేసినట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా..? లేదా సరిహద్దుల్లో దాడులు నిర్వహిస్తుందా..? ఈ దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ఇప్పటికే పహల్గాం దాడితో భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.మరీ ముఖ్యంగా సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన వారిని పట్టుకుని, కాల్చివేయడం కిరాతక చర్య అని భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఈపరిస్థితుల్లో మోడీ ప్రభుత్వంపైనా తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పాలి.
మరోవైపు ఉగ్రవాదులు అనుకున్న పని చేసి , వారి స్థావరాలకు చేరుకున్నారు. ఇప్పుడు భారత్ ప్రతీకారం ఎలా ఉండనుంది. ఇదే విషయంపై పాకిస్తానీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉరీ దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసి తామేంటో ప్రపంచానికి మోడీ సర్కార్ తెలియజేసింది. ఎవరేమనుకున్నా తగ్గేది లేదు.. దాడికి ప్రతిదాడి చేసి, ఉగ్రమూకలను మట్టుబెట్టింది. అప్పుడే అలా ఉంటే.. ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుంది. నాటి నుంచి ప్రధానిగా మోడీనే ఉన్నారు. మరి ఇప్పుడు మోడీ , భారత రక్షణ దళాల.. యుద్ధతంత్రం ఎలా ఉండనుంది..?
మరోవైపు..ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మిలిటరీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత పాక్ యుద్ధ విమానాలు(pak war planes) కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయల్దేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్‌లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం.. కరాచీలోని దక్షిణ ఎయిర్‌కమాండ్ నుంచి ఉత్తరం వైపుగా లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు బయల్దేరుతున్నాయి. రావల్పిండిలో పాక్‌కు అత్యంత కీలకమైన నూర్‌ఖాన్ బేస్ ఉంది. ఇది భారత్ సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం. ఒక రవాణా విమానం (Lockheed C-130 Hercules), నిఘా కార్యకలాపాలు, వీఐపీలను తరలించేందుకు వాడే విమానం (Embraer Phenom 100 jet) ఆ పోస్టుల్లో కనిపించాయి.
ఉగ్రదాడులు అనగానే పుల్వామా ఘటన గుర్తుకురాకమానదు. 2019లో జరిగిన ఆ దిగ్భ్రాంతికర ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. దానిపై భారత్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ గ్రూప్ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. గత అనుభవాల దృష్ట్యా పాకిస్థాన్ అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3గంటల సమయం సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఘటన నేపథ్యంలో ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఉగ్రదాడి దృష్ట్యా దిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.