ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ విడిభాగాల కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో ఒప్పందంను పొడిగించిన జీఈ ఏరోస్పేస్
జీఈ ఏరోస్పేస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) నేడు తయారీ ఒప్పందాన్ని షరతులకు లోబడి పొడిగించుకున్నట్లుగా వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా టీఏఎస్ఎల్ పలు వాణిజ్య విమాన ఇంజిన్ విడిభాగాలను ఉత్పత్తి చేయడంతో పాటుగా జీఈ యొక్క గ్లోబల్ ఇంజిన్ తయారీ ఫ్యాక్టరీలకు సరఫరా చేయనుంది. బహుళ సంవత్సరాల ఈ కాంట్రాక్ట్ విలువ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఏరోస్పేస్ పరిశ్రమలో జీఈ మరియు టీఏఎస్ఎల్ నడుమ వృద్ధి చెందుతున్న సంబంధాన్ని ప్రదర్శిస్తోంది.
ఈ ఇంజిన్ విడిభాగాలను హైదరాబాద్‌లోని టాటా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్ (టాటా–టీసీఓఈ) వద్ద తయారుచేస్తారు. ‘‘టీఏఎస్ఎల్తో మా భాగస్వామ్యం గత ఐదు సంవత్సరాలుగా వృద్ధి చెందుతూనే ఉంది. టాటా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్ వేగంగా వృద్ధి చెందడంతో పాటుగా మాకు అతి ముఖ్యమైన భాగస్వామిగా నిలిచింది. మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ ఆశయాలకు ప్రతిరూపంగా ఈ సంస్థ నిలిచింది’’ అని మైక్ కౌఫ్మాన్, వీపీ –జీఎం, పర్చేజింగ్, జీఈ ఏరోస్పేస్ అన్నారు. ‘‘దేశంలో ఏరోస్పేస్ నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్య పెంపుపై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాము. అంతర్జాతీయ వినియోగదారుల కోసం అతి క్లిష్టమైన ఏరో–ఇంజిన్ తయారీ కోసం అత్యాధునిక షాప్‌గా టాటా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్ ఏర్పాటుచేశాము. సుప్రసిద్ధ వాణిజ్య ఇంజిన్ తయారీదారునిగా, జీఈ మాకు అతి క్లిష్టమైన ఏరో ఇంజిన్ తయారీ ప్రక్రియలను భారతదేశంలో తయారుచేసేందుకు సహాయపడింది’’ అని శ్రీ సుకరణ్ సింగ్,మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అన్నారు.






