జొమాటో సంచలన నిర్ణయం.. 225 నగరాల్లో
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా జొమాటో ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాస్ ఆర్డరు విలువ (జీఓవీ) 0.3 శాతం ఉన్న కారణంగా ఆయా నగరాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని త్రైమాసికాలుగా 225 నగరాల్లో వ్యాపారం ప్రోత్సాహకరంగా లేదు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్లో నెలకొన్న ఈ మందగమనం ఎవరూ ఊహించనదని పేర్కొంది. ఈ నిర్ణయం వ్యాపార వృద్ధిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని, కంపెనీ నిర్దేశించుకున్న దీర్ఘకాల లక్ష్యాలను అందుకోవడం ఎంతో ముఖ్యమని జొమాటో పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.






