Shashi Tharoor: శశిథరూర్ ను కాంగ్రెస్ బహిష్కరించనుందా..? అందుకు లైన్ క్లియర్ చేస్తోందా…?

గత కొంతకాలంగా కాంగ్రెస్ (Congress) నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్… కేంద్రంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ వద్దన్నా వినకుండా.. దేశం తరుపున ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇతర దేశాలకు వెళ్లడం జరిగింది. అసలు ఆపరేషన్ సిందూర్ ముఖ్య ఉద్దేశ్యం… పాకిస్తాన్ దుర్మార్గాలను పూర్తిగా ఎండగట్టడం, ప్రపంచదేశాల మద్దతు మనకుండేలా చేయడం దీని ముఖ్య అజెండా. దీన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా మిగిలిన ఎంపీల మాదిరే నిర్వహించారు. అయితే ఇక్కడ ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయాల్ని నేరుగా శశిథరూర్ తోసిపుచ్చారు. దీనికి తోడు మోడీతో కలిసి ఓ వేదికపై కనిపించడంతో కాంగ్రెస్, శశిథరూర్ మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్తున్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌పై కేపీసీసీ మాజీ అధ్యక్షుడు కె.మురళీధరన్ విరుచుకుపడ్డారు. థరూర్ తమతో లేడని, ఇకపై కేరళలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలకు ఆయన్ను పిలవబోమని స్పష్టం చేశారు. థరూర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడని, ఆయనపై ఏ చర్యలు తీసుకోవాలనేది అధిష్టానమే నిర్ణయించాలని మురళీధరన్ చెప్పారు. కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ ఉత్తమమంటూ ఇటీవల ఓ సర్వేలో వెల్లడైనప్పుడు కూడా మురళీధరన్ ఘాటుగా స్పందించారు. అసలు థరూర్ ఏ పార్టీలో ఉన్నారో ముందుగా చెప్పాలని ఎద్దేవా చేశారు.
పార్టీ ప్రయోజనాల కన్నా దేశం ముఖ్యమనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, కొన్ని సార్లు దీన్ని నమ్మకద్రోహంగా భావిస్తుంటారని, అదే పెద్ద సమస్య అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా రాజకీయాలు అంటే పోటీ కావడం దురదృష్టకరమని, కొన్ని సందర్భాల్లో క్రాస్-పార్టీ సహకారాన్ని అవిధేయతగా చూస్తుంటారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఇటీవల కాలంలో సంబంధాలపై కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, రాజకీయాలు అంటేనే పోటీ అని, తనలాంటి వాళ్లు తమ పార్టీలను గౌరవిస్తారని, అయితే జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి మనం ఇతర పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుందని, అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి పార్టీలు దానిని అవిధేయతగా భావిస్తుంటాయని, అదే పెద్ద సమస్య అని నవ్వుతూ సమాధానమిచ్చారు. మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైనదేనని తాను నమ్మడం వల్ల అనేక మంది తనను విమర్శించారని, అయితే తన వైఖరి సరైనదేనని తాను నమ్మి నిలబడ్డానని చెప్పారు.