Delhi: కాంగ్రెస్ పై పోరాటంలో ఈసీకి బీజేపీ మద్దతు..?

ఎన్డీఏ కూటమి గెలుపు అసలైన గెలుపు కాదంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 2024 ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మోడీకి ఈసీ జేబు సంస్థల మారిందని.. నిజానికి చెప్పాలంటే ఈసీ చనిపోయిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. వీటికి జవాబివ్వడంలో ఈసీ అధికారులు అంతగా సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. దీంతో రాహుల్ వాయిస్, మరీ ముఖ్యంగా ఇండియా కూటమి వాయిస్ జనంలోకి చొచ్చుకుని వెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఈసీకి కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు, నేతలు.. వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అసలు ఈసీ పూర్తిగా నిష్పాక్షికంగా నడిచే సంస్థ అని గుర్తు చేస్తున్నారు. అలాంటి సంస్థపై ఆరోపణలు.. అవీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ నేతలకు.. చైనా, పాకిస్తాన్ పై ఉన్న నమ్మకం… దశాబ్దాలుగా దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్న రాజ్యాంగ సంస్థపై లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్.. ఈవిషయంలో అస్సలు వెనక్కు తగ్గడం లేదు.
లోక్‌సభ ఎన్నికలు-2024లో ‘రిగ్గింగ్’ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) విరుచుకుపడ్డారు. భారత ఎన్నికల కమిషన్ (ECI)పై చేసిన వ్యాఖ్యలను సవాలు చేశారు. ఈసీఐపై ఆయన (రాహుల్) వద్ద ఆధారాలుంటే ‘ఆటంబాంబు’ పేల్చాలని సవాలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయవచ్చనీ, రిగ్గింగ్ చేశారని రాహుల్ చెప్పడానికి ఆధారాలు ఉంటే వాటిని చూపించాలని అన్నారు.
‘ఎన్నికల కమిషన్ రిగ్గింగ్ చేసిందనడానికి ఆధారాలతో కూడిన ఆటంబాంబు సిద్ధం చేశానని ఆయన చెబుతున్నారు. ఆటంబాంబు ప్రూఫ్స్ అనేవి ఉంటే ఆయన వెంటనే ఆటమిక్ పరీక్ష జరపాలి. అసలు నిజం ఏమిటంటే.. ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేనేలేవు’ అని రాజ్‌వాథ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్‌నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.