Dharmasthala: ధర్మస్థల సీరియల్ మర్డర్స్..! ఎప్పుడు.. ఎందుకు.. ఎలా..?

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల (Dharmasthala), శ్రీ మంజునాథ స్వామి ఆలయం (Sri Manjunatha Swamy Temple) నెలవైన పవిత్ర యాత్రా క్షేత్రం. ఇటీవల ఒక దారుణమైన సీరియల్ మర్డర్స్ (Serial murders case) కేసు కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (Sanitary worker) చేసిన ఫిర్యాదు తర్వాత సామూహిక హత్యల (mass murders) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దశాబ్దాల పాటు దాచిపెట్టిన భయానక నేరాలను ఇది బహిర్గతం చేసింది. ఇప్పుడీ మాస్ మర్డర్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
ధర్మస్థల, మంగళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్న ఒక పవిత్ర పట్టణం. ఈ నెల 3న ఆలయంలో పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు దాఖలు చేసిన ఫిర్యాదు సంచలనం కలిగించింది. 1995 నుండి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి.. తన హయాంలో వందలాది శవాలను పూడ్చిపెట్టానని, కొంతమంది కాల్చేశానని ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి కొంతమంది పెద్దలు ఈ పని చేయించారని, వాళ్లలో చాలా మంది లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడించాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ఈ పారిశుద్య కార్మికుడు నేత్రావతి నది పరిసరాల్లో శుభ్రపరిచే పనులు చేసేవాడు. 1995 నుంచి పలు సందర్భాల్లో ఆలయ పెద్దలు తనను బలవంతంగా కొన్ని శవాలను పాడ్చి పెట్టారని చెప్పారని వివరించారు. “చాలా శవాలు బట్టలు లేకుండా ఉండేవి, కొన్ని శవాలపై అత్యాచారం, హింస గుర్తులు స్పష్టంగా కనిపించాయి,” అని అతను తన ఫిర్యాదులో వివరించాడు. ఈ పని చేయనని చెప్పినప్పుడు తనను బెదిరించి కొట్టారని, ఈ పని చేయకపోతే “నీ శవాన్ని కూడా ఇలాగే పాతిపెడతాం” అని బెదిరించారని ఆరోపించాడు. 2014లో తన కుటుంబంలోని ఒక బాలికపై దాడి జరిగిన తర్వాత, అతను కుటుంబంతో సహా ధర్మస్థల నుండి పారిపోయి, పొరుగు రాష్ట్రంలో దాక్కున్నట్టు వివరించాడు.
2010లో కల్లేరిలోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో 12-15 ఏళ్ల బాలిక శవాన్ని ఆమె స్కూల్ యూనిఫాంతో పాటు పూడ్చి పెట్టినట్టు వివరించారు. అత్యాచారం, గొంతు బిగించిన గుర్తులతో ఆ అమ్మాయి కనిపించిందని వివరించాడు. మరొక సందర్భంలో, ఒక మహిళ యాసిడ్ కాల్చి వార్తాపత్రికలో చుట్టిన ఒక మహిళ శవాన్ని కాల్చాలని ఆదేశించారని ఆరోపించాడు. ఈ ఫిర్యాదుతో పాటు ఇటీవల అతను తవ్వి తీసిన కొన్ని అస్థిపంజరాల ఫోటోలను కూడా సమర్పించాడు. తన ఆరోపణలకు ఆధారాలున్నాయని వెల్లడించాడు. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు ఆధారంగా జూలై 4న BNS సెక్షన్ 211(a) కింద కేసు నమోదు చేశారు. ఈ కార్మికుడు తన గుర్తింపును గోప్యంగా ఉంచాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. ఎందుకంటే ఈ నేరాల వెనుక ఉన్నవారు శక్తివంతమైన వ్యక్తులని ఆరోపించాడు.
ఈ ఫిర్యాదు తర్వాత కర్నాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసింది. దీనికి ప్రణబ్ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. జూలై 13న ఈ కార్మికుడు బెళ్తంగడి కోర్టులో ముసుగు ధరించి, భారీ భద్రతతో తన వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు శవాలను తవ్వి తీయడానికి కోర్టు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. DNA పరీక్షల ద్వారా శవాల గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు 2012లో సౌజన్య అనే 17 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసుతో ముడిపడి ఉండవచ్చని భావిస్తున్నారు. అప్పట్లో ఈ కేసు సంచలనం కలిగించింది. కానీ నేరం నిర్ధారణ కాలేదు. సామూహిక హత్యారోపణలు ధర్మస్థలలోని స్థానికులు, భక్తులలో భయాందోళనలను రేకెత్తించాయి. మత సంస్థల దుర్వినియోగంపై ఈ కేసు మరోసారి చర్చను రేకెత్తించింది. స్థానిక సమాజంలో ఆగ్రహం పెంచింది. 2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని అదృశ్యమైన కేసును ఆమె తల్లి సుజాత ఈ సందర్భంగా మళ్లీ ప్రస్తావించింది
పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు, కానీ ఇంకా శవాల తవ్వకం ప్రారంభం కాలేదు. సీరియల్ మర్డర్స్ కేసు, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడి సాహసోపేతమైన ఫిర్యాదు ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక భయానక నేర కథ. ఈ ఘటన సమాజంలో భయం, ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాక, మత సంస్థల బాధ్యత, నియంత్రణపై ప్రశ్నలను లేవనెత్తింది. పోలీసు దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ, ఈ కేసు యొక్క పూర్తి వాస్తవాలు బయటపడతాయని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.