ఆర్బీఐ కీలక ప్రకటన.. 76 శాతం వెనక్కి
రూ.2,000 నోట్ల (మే 19న)ను ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. దీంతో ఆ నోట్లన్నీ డిపాజిట్లు, మార్పిడి రూపంలో బ్యాంకులకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లలో 76 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మే 19 తర్వాత జూన్ 30వ తేదీ వరకు రూ.2.72 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు మళ్లీ బ్యాంకులకు చేరుకున్నాయి. మొత్తం చలామణిలో ఉన్న నోట్లలో ఇది 76 శాతం. ఇక, రూ.84 వేల కోట్ల విలువైన నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి అని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. బ్యాంకులకు చేరుకున్న రూ.2 వేల నోట్లలో దాదాపు 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగతా 13 శాతం నోట్లను ప్రజలు మార్చుకున్నట్లు పేర్కొంది. రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు విధించింది.






