Dollor City: ఇండియా డాలర్ సిటీకి ట్రంప్ దెబ్బ ఏ రేంజ్ లో అంటే..?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అనుసరిస్తోన్న వైఖరి భారత్ తో పాటుగా ఇతర ఆసియా దేశాలకు కూడా తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్ధం కాక.. పలు దేశాలు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తమతో సన్నిహితంగా ఉండే దేశాల విషయంలో కూడా ట్రంప్ తన వైఖరితో ఇబ్బంది పెడుతున్నారు. భారత్ ను తాజాగా సుంకాలతో దెబ్బ కొట్టారు. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఉక్రెయిన్ – రష్యా యుద్దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తోన్న ట్రంప్.. రష్యాతో సన్నిహితంగా ఉండే దేశాలపై ఒత్తిడి పెంచారు.
అందుకే భారత్ పై రెండు దఫాలుగా ట్రంప్ సుంకాలు విధించారు. అయితే ఈ సుంకాల ప్రభావం తమిళనాడులోని తిర్పూర్ పై ఎక్కువగా పడుతోంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వస్త్రాలు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. వస్త్ర వ్యాపారుల ఎగుమతుల్లో అక్కడి నుంచి 30 శాతం మేర అమెరికాకు ఎగుమతి అవుతాయి అంటే ఏ రేంజ్ లో అమెరికాపై తిర్పూర్ ఆధారపడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయంతో ఎగుమతి చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపడం లేదు.
ఇప్పటికే తయారీని కూడా తగ్గించేసారు అక్కడి వ్యాపారులు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో అక్కడి వస్త్రాలే ఎక్కువగా వాడుతూ ఉంటారు. బ్రాండెడ్ వస్త్రాలతో పాటుగా తక్కువ ధరకు లభ్యమయ్యే వస్త్రాలు కూడా అక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ట్రంప్ నిర్ణయం వారి వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 12,000 కోట్ల విలువైన తిర్పూర్ వస్త్ర ఎగుమతుల్లో 30% అమెరికాకే వెళ్తాయి. ట్రంప్ నిర్ణయంతో 2,000 – 3,000 కోట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనితో ఇతర దేశాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.
అక్కడ 10 శాతం వ్యాపారులు అమెరికా మార్కెట్ పైనే ఆధారపడి ఉన్నారట. అయితే ఇప్పుడు యూకే నుంచి ఆర్డర్ లు పెరిగినట్టు అక్కడి వ్యాపారులు చెప్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా(Australia) మరియు కెనడాలకు ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు ఉండటంతో డాలర్ సిటీగా చెప్తారు ఈ నగరాన్ని. కాగా గత ఆర్ధిక సంవత్సరంలో తిరుప్పూర్ కు 35 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అది పెరుగుతుందని అంచనా వేసిన సమయంలో ట్రంప్ కొట్టిన దెబ్బ నష్టాల్లోకి నెట్టే అవకాశం ఉండవచ్చు.







