Moscow: మిత్రులకు మేం ప్రాధాన్యమిస్తాం.. భారత్ పట్ల అమెరికా తీరు అన్యాయమన్న రష్యా

మిత్రదేశం భారత్ పట్ల అమెరికా అన్యాయంగా ప్రవర్తిస్తోందని రష్యా ఆరోపించింది. దీనికోసం ఆర్థికవ్యవస్థలను ఆయుధంగా వాడుకుంటోందని విమర్శించింది. వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఆంక్షలు విధించరని వాషింగ్టన్‌ను దెప్పిపొడిచారు. రష్యా భవిష్యత్తులోను భారత్ అలాంటి చర్యలు తీసుకోదన్నారు రష్యన్ దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్. భారత్‌కు ఎటువంటి ఇబ్బందిలేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసిందన్నారు. ప్రస్తుతం సగటున 5 శాతం డిస్కౌంట్‌తో భారత్ అవసరాల్లో 40శాతం సరఫరా చేస్తున్నామన్నారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు భారత్ ఇబ్బంది పడుతుంటే.. రష్యా మార్కెట్లు స్వాగతం పలుకుతాయని చెప్పారు.
భారత్-రష్యా మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోను కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు బబుష్కిన్. ప్రస్తుతం న్యూఢిల్లీ సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో అండగా ఉండటానికి తమ దేశం కట్టుబడి ఉందని రోమన్ వెల్లడించారు. చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్లపై చర్చలు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. భారత్‌లో ఉత్పత్తులు చేయడానికి న్యూఢిల్లీకి సరైన భాగస్వామి రష్యానే (Russia) అని పేర్కొన్నారు. గతంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీని గుర్తుచేశారు. శక్తిమంతమైన జెట్ ఇంజిన్ల తయారీపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు. భారత్ తమకు చాలా ముఖ్యమైన దేశమని.. అందుకే అధ్యక్షుడు పుతిన్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ప్రధాని మోడీతో మాట్లాడారన్నారు. సమస్యల పరిష్కారంపై బీజింగ్-న్యూఢిల్లీ కలిసి పని చేయడాన్ని స్వాగతించారు. చైనా (China) మంత్రి వాంగ్‌యీ పర్యటన విజయవంతమైందన్నారు.
ఇక రష్యాను శిక్షించేందుకు ఆంక్షలు విధించినవారే ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారని రోమన్ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో కుదుపులు నెలకొన్న నేపథ్యంలో వాటిని స్థిరీకరించే శక్తిగా బ్రిక్స్ (BRICS) ఉంటుందని రోమన్ వెల్లడించారు. మరోవైపు..రష్యా ఉత్పత్తి చేసే ఉరల్స్ చమురు కొనుగోళ్లను భారత్ రిఫైనరీలు పునరుద్ధరించాయి. ఐవోసీ, బీపీసీఎల్ తాజాగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో డెలివరీలకు ఆర్డర్లు పెట్టాయి. తాజాగా మాస్కో డిస్కౌంట్లను పెంచడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి కొనుగోళ్లు పెరగడంతో.. చైనాకు సరఫరాలు తగ్గనున్నాయి. జులైలో డిస్కౌంట్లు తగ్గడంతో.. భారత సంస్థలు కొనుగోళ్లు నిలిపాయి. కానీ ఆ తర్వాత పరిణామాల్లో రాయితీ 3 డాలర్లకు పెరిగింది. తాజాగా ఆర్డర్లు పెట్టినట్లు తెలుస్తోంది.