Virat Kohli: కోహ్లీ ఇంటికి స్టార్ ప్లేయర్లు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఏం చేసినా సరే వార్తల్లో ఉంటాడు. అతని గురించి ఏ వార్త వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అతను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియన్ టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ ఒకరకంగా ప్రాణం పోసాడనే చెప్పాలి. త్వరలో ఇంగ్లాండ్ లో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ లేకపోవడం జట్టుకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే కోహ్లీ మ్యాచ్ చూడటానికి మైదానానికి రావాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం లండన్ లో నివాసం ఉంటున్న కోహ్లీ.. జట్టుతో కలవాలని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ టైంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లండన్ లోని తన ఇంటికి భారత ఆటగాళ్లను కొంతమందిని ఆహ్వానించాడు కోహ్లీ. కెప్టెన్ గిల్(Shubhaman Gill), వైస్ కెప్టెన్ పంత్, మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్(KL Rahul) వంటి ఆటగాళ్లను కోహ్లీ తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
మైదానంలో ఈ ఆటగాళ్లతో కోహ్లీ సన్నిహితంగా ఉంటాడు. వీళ్ళందరూ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీలో ఆడిన వాళ్లే. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మాత్రం ఆహ్వానం లేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. గంభీర్ కు కోహ్లీకి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విభేదాలు తొలగిపోయాయి అనే ప్రచారం జరిగింది. అయితే కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి గంభీర్ కారణం అనే ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో మరోసారి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సంచలనంగా మారాయి. ఇప్పుడు స్వయంగా కొంతమంది ఆటగాళ్లని మాత్రమే కోహ్లీ తన ఇంటికి ఆహ్వానించడం సంచలనమైంది.







