America: భారత్ మాతో కలిసి వస్తుంది, అమెరికా ధీమా..!

భారత్ – అమెరికా(United states) దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, రష్యాతో స్నేహం చేస్తుందనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. అవి నేటి నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా అధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ – అమెరికా సంబంధాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు. చివరికి రెండు దేశాలు ఏకతాటి మీదకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేసారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం స్థితి గురించి మాట్లాడిన ఆయన.. ఇంకా ఒప్పందం జరగలేదు అన్నారు. మే లేదా జూన్ నాటికి ఒప్పందం పూర్తవుతుందని తాను భావించినా.. కొన్ని కారణాలతో వాయిదా పడినట్టు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్నత స్థాయిలో చాలా మంచి సంబంధం ఉందని బెసెంట్ వివరించారు.
ఇది సంక్లిష్టమైన సమయం అని, కాకపోతే రష్యన్ చమురు వ్యవహారం ఇబ్బందిగా మారిందన్నారు. అమెరికా ద్రవ్యలోటు దేశమన్న ఆయన.. వాణిజ్య సంబంధాలలో విభేదాలు ఉన్నప్పుడు, ద్రవ్యలోటు ఉన్న దేశం ప్రయోజనం పొందుతుందని తెలిపారు. మిగులు ఉన్న దేశం ఆందోళన చెందాలన్నారు. అందుకే భారత్.. అమెరికాకు ఎగుమతులు చేస్తుందని తెలిపారు. భారత్ సుంకాలు అందరికంటే ఎక్కువన్నారు. వాటి కారణంగా ద్రవ్య లోటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి అత్యంత కనిష్ట స్థాయిలో ఉందన్నారు.