నేటి నుంచి భారత్-అమెరికా యుద్ధవిన్యాసాలు
వజ్ర ప్రహార్ పేరిట భారత్, అమెరికాల ప్రత్యేక బలగాల ఉమ్మడి యుద్ధవిన్యాసాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరిగే ఈ యుద్ధక్రీడలకు అమెరికాలోని ఇదాహోలో ఉన్న ఆర్చర్డ్ కంబాట్ ట్రైనింగ్ సెంటర్ వేదిక కానుంది. ఈ సందర్భంగా రెండు దేశాల బలగాలు తమ అనుభవాలు, అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోనున్నాయి. ఇరు పక్షాల సైనికుల మధ్య సమన్వయానికి ఇది తోడ్పడుతుందని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల తరపున 45 మంది సైనికుల చొప్పున ఇందులో పాల్గొంటారు. వజ్ర ప్రహార్ విన్యాసాలు చివరిసారిగా 2023 డిసెంబరులో మేఘాలయలో జరిగాయి. ఈ ఏడాది భారత్, అమెరికా సైనికుల మధ్య జరుగనున్న రెండో యుద్ధ క్రీడలివి. సెప్టెంబరులో రాజస్థాన్లో యుద్ధ అభ్యాస్ పేరిట ఉమ్మడి విన్యాసాలు జరిగాయి.






