యూఏఈలో మరోసారి క్షమాభిక్ష
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో క్షమాభిక్ష మరోసారి అమల్లోకి వచ్చింది. తమ దేశానికి వర్క్ వీసాపై వచ్చిన వారు ఖల్లివెల్లి ( అక్రమ నివాసి) కావడం, విజిట్ వీసాలపై వచ్చినవారు వీసా గడువు ముగిసినా చట్టవిరుద్ధంగా ఉండిపోవడాన్ని యూఏఈ ప్రభుత్వం గుర్తించింది. వీసాలు ఉన్నవారి కంటే వీసాలు లేనివారి సంఖ్య పెరిగిపోతుండటంతో అమ్నెస్టీకి యూఏఈ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 1తో మొదలైన క్షమాభిక్ష అక్టోబర్ 31తో ముగియనుంది. తెలంగాణకు చెందిన వలస కార్మికులకు క్షమాభిక్ష ఒక వరమని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.
తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారు దాదాపు 40 వేల మంది ఉంటారని ఓ అంచనా. మన దేశంలోని యూపీ, బిహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు ఒక లక్ష మంది వరకు క్షమాభిక్ష లబ్ది పొందే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల వలస కార్మికుల సంఖ్య ఎక్కువ మొత్తం లోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది.






