Donald Trump : హలోనా? గుడ్‌బైనా? ఏదో మీరే తేల్చుకోండి : ట్రంప్

బందీలందరినీ విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అల్టిమేటం జారీ చేశారు. ఇదే ఆఖరి హెచ్చరిక అని పేర్కొన్నారు. హమాస్ (Hamas) ఇటీవల విడిచిపెట్టిన 8 మంది బందీలతో శ్వేతసౌధంలో సమావేశమైన అనంతరం ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హలోనా, గుడ్‌బైనా? ఏదో మీరే తేల్చుకోండి. బందీలందరిని వెంటనే విడుదల చేయండి. మరణించిన వారి మృతదేహాలను తక్షణం అప్పగించండి. లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకు ఇజ్రాయెల్ (Israel)కు అవసరమైనవన్నీ పంపుతాను. నేను చెప్పినట్లు చేయకపోతే ఒక్క హమాస్ సభ్యుడూ సురక్షితంగా ఉండదు. మీ చెరవలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని కలిశాను. ఇదే మీకు చివరి హెచ్చరిక. హమాస్ నాయకత్వానికి ఒకటే చెబుతున్నా. ఇది మీరు గాజా (Gaza) విడిచి వెళ్లాల్సిన సమయం. బందీలను విడిచిపెడితే గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఉంటుంది. విడిచిపెట్టకపోతే అంతా చచ్చిపోతారు. తెలివైన నిర్ణయం తీసుకోండి. బందీలను విడుదల చేయండి. లేకపోతే నరకం చవిచూస్తారు. భారీ మూల్యం చెల్లించుకుంటారు అని ట్రంప్ పేర్కొన్నారు.