USA: యూఎస్ ఆర్మీ ఈవెంట్‌కు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్?.. వైట్ హైస్ సమాధానమిదే..!

అమెరికా (USA) సాయుధ దళాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సైనిక కవాతులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా పాల్గొంటారని, ఆయన్ను యూఎస్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించిందని వచ్చిన వార్తలపై యూఎస్ ప్రభుత్వం స్పందించింది. అటువంటి ఆహ్వానం ఏదీ ఇవ్వలేదని, ఈ కథనాలు పూర్తిగా తప్పు అని వైట్ హైస్ (White House) వెల్లడించింది. విదేశాల సైనికాధికారులను ఈ కవాతుకు పిలవలేదని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా సైనిక బలాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో మాత్రమే ఈ పరేడ్ నిర్వహిస్తారని స్పష్టంచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏ విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం వెళ్లలేదని యూఎస్ (USA) అధికారికంగా ప్రకటించింది. అసీమ్ మునీర్‌కు యూఎస్ ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్రంగా స్పందించారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆయన.. భారత విదేశాంగ విధానానికి జరిగిన ఘోరమైన అవమానంగా ఈ ఘటనను అభివర్ణించారు. వైట్ హౌస్ తాజాగా చేసిన ప్రకటనతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.