Peter Navarro: అమెరికా ఆంక్షలు భేఖాతర్.. రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు.. ట్రంప్ సర్కార్ అసహనం..

ఇప్పటికే 25శాతం సుంకాలు విధించింది. ఆపై మరో 25శాతం అదనంగా పెంచింది అమెరికా.. అయినా భారత్ అదరలేదు.. బెదరలేదు.. అంతే కాదు మాదేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ స్పష్టం చేసింది. అంతేకాదు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు సైతం పెరిగాయి. ఇప్పుడేం చేయాలి.. ఇంతకన్నా ఏం చేయాలి..? ఇదే అమెరికా ముందున్న ప్రశ్న..అయితే తాము బెదిరించినా.. భారత్ బెదరకపోవడం.. పైగా కొనుగోళ్లు పెంచడంతో ఎలా ముందుకెళ్లాలో ట్రంప్ సర్కార్ కు అర్థం కావడం లేదు.
రష్యా (Russia) యుద్ధం ఆపడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు భారత్ గండి కొడుతోందని అమెరికా, యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా శ్వేతసౌధంలోని ట్రంప్ కీలక సలహాదారు పీటర్ నవారో మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమెరికాకు ఓ వ్యూహాత్మక భాగస్వామిలా భారత్ వ్యవహరించాలన్నారు. చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాల కోసం భారత్ చూస్తోందన్నారు. ఇప్పుడు ఆ రెండు దేశాల సంబంధాల విషయంలో సౌకర్యవంతంగా ఉందన్నారు.
‘‘భారత్‌ను అమెరికా (USA) ఓ వ్యూహాత్మక భాగస్వామిగా చూడాలి అంటే.. న్యూఢిల్లీ కూడా ఆ విధంగానే వ్యవహరించాలి. రష్యా చమురుకు న్యూఢిల్లీ గ్లోబల్ క్లియరింగ్ హౌస్‌లా పనిచేస్తోంది. ఆంక్షల పరిధిలోని చమురును విలువైన గూడ్స్ కింద మార్చి ఎగుమతులు చేస్తోంది. మాస్కోకు అవసరమైన డాలర్స్‌ను సమకూరుస్తోంది’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తే.. అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చినట్లు అవుతుందన్నారు. చైనా(China), రష్యాతో న్యూఢిల్లీ సంబంధాల నేపథ్యంలో అత్యాధునిక సైనిక టెక్నాలజీని విక్రయించడం రిస్క్‌తో కూడుకొన్న పని అని పేర్కొన్నారు.
భారత్-అమెరికా మధ్య 25-29 మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు రద్దైన తర్వాత పీటర్ నవారో వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొత్తం భారత వస్తువులపై అమెరికా సుంకాలు 50శాతానికి చేరనున్నాయి. ఈ చర్యలను భారత్ దురదృష్టకరమైనవిగా అభివర్ణించింది. తమ సంప్రదాయ విక్రేతలు యూరప్ వైపు మళ్లడంతో.. రష్యా చమురు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది. తమను నిందిస్తున్న దేశాలు కూడా రష్యాతో వ్యాపారంలో ఉన్నాయని.. అది కూడా తమ వలే జాతీయ అవసరాల కోసం చేసి కాదని విదేశాంగ శాఖ దుయ్యబట్టింది.