Donald Trump: భారతీయులకు గడ్డు కాలం, ట్రంప్ మరో సంచలన అడుగు..!

రెండవ సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఇమ్మిగ్రేషన్ విధానాలతో ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతోన్న ట్రంప్.. ఇప్పుడు విద్యార్ధులు(Student Visa), గ్రీన్ కార్డు(Green Card) హోల్డర్ లపై కన్నేశారు. ఇటీవల ట్రంప్ సర్కార్ విధానాలను వ్యతిరేకించినా, విమర్శించినా సరే వారి వీసాలను రద్దు చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉగ్రవాదులతో సంబంధాలున్నా, ఇజ్రాయిల్ ను వ్యతిరేకించినా సరే వారి వీసాలను రద్దు చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వారి వీసాలను మరోసారి ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయనున్నారు.
ఈ తనిఖీల సందర్భంగా వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్ట్ లను కూడా పరిశీలిస్తుంది విదేశాంగ శాఖ. ఏ మాత్రం తేడా అనిపించినా వారిని ఇంటర్వ్యూ చేసి వారి వారి దేశాలకు పంపిస్తారు. ఇక ఇప్పుడు మద్యం సేవించి వాహనం నడిపినా, ఏదైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడినా వారిని వారి దేశాలకు పంపించేస్తారు. గ్రీన్ కార్డు హోల్డర్లు, హెచ్ 1 బీ వీసాలు ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. గ్రీన్ కార్డు హోల్డర్ ల సోషల్ మీడియా ఖాతాలను సైతం పరిశీలిస్తుంది అమెరికా విదేశాంగ శాఖ.
వీరిలో ఎక్కువగా భారతీయులే ఉన్న సంగతి తెలిసిందే. వీసాలు జారీ చేసే సమయంలో కూడా సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇదే సమయంలో అమెరికాలో వ్యాపారాలు చేసే ఇతర దేశాల వారి వీసాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ దేశంలో ఉన్న విదేశీయులు సోషల్ మీడియా ఖాతాల్లో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.