Thailand – Cambodia: థాయ్-కంబోడియా మధ్య తొలగిన యుద్ధమేఘాలు…

థాయ్-కాంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణ కాస్తా యుద్ధంగా మారిన తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా.. అన్ని దేశాల అధినేతలు..యుద్ధం వద్దు , శాంతికోసం చర్చలు జరపాలని సూచించారు. అయితే .. ఈ తరుణంలో ఇరుదేశాలు పరస్పర దాడులతో ఉద్రిక్తతను మరింతగా పెంచేశాయి. ఈ సందర్భంగా మలేషియా జోక్యం ఇరుదేశాల మధ్య శాంతిని చిగురింప జేసింది.
ఆగ్నేయాసియాలో యుద్ధమేఘాలు తొలగిపోయాయి. కొన్ని రోజులుగా సరిహద్దు ఘర్షణలో మునిగిన థాయ్‌లాండ్-కంబోడియా (Thailand-Cambodia) తక్షణమే, షరతుల్లేని కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు.కొన్నిరోజులుగా సరిహద్దులో కాల్పులతో చెలరేగిపోతున్న థాయ్‌లాండ్-కంబోడియాలు ఎట్టకేలకు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం ప్రకటించారు.
చర్చల కోసం సోమవారం మలేసియాలో భేటీ కావాలని ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే సానుకూల ఫలితం వెలువడింది. సరిహద్దు వెంబడి మందుపాతర పేలిన కారణంగా ఐదుగురు థాయ్ సైనికులు గాయపడటంతో ఘర్షణ మొదలైంది. ఇరుదేశాల సైన్యాలు పరస్పరం తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్లతో దాడి చేసుకున్నాయి. దీంతో కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతోపాటు ఆ దేశ రాయబారిని థాయ్‌లాండ్ బహిష్కరించింది. తర్వాత అవి తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. సుమారు రెండులక్షల మంది నిర్వాసితులు అయ్యారు.