Sridhar Babu: ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూ ఏఈ భాగస్వామ్యం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామా (Omar bin Sultan Al-Olama)తో శ్రీధర్ బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లో తెలంగాణ భాగస్వామ్యంతో ఏఐ (AI) అభివృద్ధి, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముందుకు రావాలని మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాను ఆహ్వానించారు. డీప్-టెక్, ఏఐ స్టార్ట్‌పలలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలున్నాయ న్నారు. గేమింగ్‌లో తెలంగాణ-యూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటుకు ముందుకురావాలని యూఏఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూఏఈ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామా మాట్లాడుతూ ఏఐ, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ (Cybersecurity) , గేమింగ్ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యూఏఈ ప్రభుత్వ ఏఐ ఆధారిత స్టార్ గేట్ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఈలో నిర్వహించనున్న ఫిన్ టెక్ స్టార్టప్స్ సమ్మిట్‌లో తెలంగాణ కంపెనీలను భాగస్వాములను చేస్తామని చెప్పారు.