Sleep: ఆరు గంటల కంటే తక్కువ నిద్ర, చావుకు దగ్గరైనట్టే..!

ఆరోగ్యకరమైన జీవనశైలికి తగినంత నిద్ర(Sleep) కీలకం. నిద్ర అనేది శారీరక, మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో నిద్ర లేమి ఒక సాధారణ సమస్య. మిమ్మల్ని గజిబిజిగా మార్చడంతో పాటు, నిద్ర లేకపోవడం ఇతర అనారోగ్య పరిస్థితులకు సైతం దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర రాకపోవడం వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్(Heart Stroke) ద్వారా చనిపోయే అవకాశాలు రెట్టింపు అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి ఉన్న వారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు సగటున 49 సంవత్సరాల వయస్సు గల 1,344 మందిపై విశ్లేషణ చేశారు. వారిని ప్రయోగశాలలో ఒక రాత్రి నిద్రపోవాలని కోరిన పరిశోధకులు.. 39 శాతం మందికి కనీసం మూడు ప్రమాద కారకాలు ఉన్నాయని ఫలితాలలో గుర్తించారు. వీటిని కలిపి పరిశీలిస్తే.. వాటిని మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలుస్తారని పరిశోధకులు మీడియాకు తెలిపారు. ప్రమాద సంకేతాలలో 30 కంటే ఎక్కువ శరీర ద్రవ్యరాశి, పెరిగిన కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగాయని తేల్చారు.
ప్రయోగశాలలో ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయిన గుండె జబ్బులు లేదా స్ట్రోక్‌తో చనిపోయే అవకాశం 2.1 రెట్లు ఎక్కువ అని తేల్చారు. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించారు. ప్రధాన పరిశోధకుడు జూలియో ఫెర్నాండెజ్-మెండోజా మాట్లాడుతూ.. గుండె జబ్బుల నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మంచి నిద్రపోవాలని.. నిద్ర రాకపోతే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరని స్పష్టం చేసారు.