జపాన్ ప్రధానిగా మరోసారి షిగెరు ఇషిబ
జపాన్ ప్రధాన మంత్రిగా షిగెరు ఇషిబను పార్లమెంటు మరోసారి ఎన్నుకుంది. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆయనను తిరిగి ప్రధానిని చేసింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోపు ఓటింగ్ ద్వారా కొత్త నాయకుణ్ని ఎన్నుకోవాల్సి ఉంది. దీనికోసం సోమవారం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఓటింగులో ఇషిబ తన ప్రత్యర్థి యోషిహికో నోడాపై 221`160 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇషిబ పార్టీ లిబరల్ డెమోక్రటిక్, దాని సంకీర్ణ భాగస్వామి పార్టీ కొమియెటో ఇటీవలి ఎన్నికల్లో పరాజయం చవిచూశాయి. ప్రధానిగా వైదొలగేందుకు ఇషిబ నిరాకరించి, సంకీర్ణంలోకి అదనపు భాగస్వాముల్ని తీసుకువచ్చి స్థిరత్వాన్ని పెంచుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్లీ పగ్గాలు దక్కించున్నా, బడ్జెట్ సహా ఏవి ఆమోదం పొందాలన్నా విపక్ష ఆమోదం అవసరం కావడంతో మున్ముందు ఇబ్బందికర పరిస్థితి అనివార్యమయ్యేలా ఉంది.






