అదంతా తప్పుడు ప్రచారం … ట్రంప్, పుతిన్ మధ్య
అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తమ అధ్యక్షుడు పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని రష్యా వెల్లడించింది. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, అదంతా తప్పుడు ప్రచారమని స్పందించింది. గత వారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు, యుద్ధంపై పరస్సరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు తెలిపింది. దీనిని ఉద్దేశించే రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి స్పందన వచ్చింది. సమాచారం నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఈ వార్తలను చూస్తుంటే తెలుస్తుంది. పేరున్న సంస్థలు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం. ఇదంతా ఊహాజనిత, తప్పుడు సమాచారం అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్దరు నేతల మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపారు.






