Rohith Sharma: రోహిత్ శర్మే కెప్టెన్, తేల్చిన బోర్డ్..?
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో, వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటారు అనే ప్రచారం ఈమధ్య గట్టిగానే జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ముందు రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని, ఇప్పటికే బోర్డు పెద్దలకు సమాచారం కూడా పంపించాడని ప్రచారం జరిగింది. ఇదే అదునుగా భావించిన సెలెక్టర్లు వన్డే క్రికెట్ కు కూడా కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.
ఇంగ్లాండ్ పర్యటనలో ఆకట్టుకుంటున్న కెప్టెన్ గిల్(Shubhaman Gill) ను పూర్తిస్థాయి కెప్టెన్ గా నియమించేందుకు సిద్ధమైనట్లు హడావుడి చేశారు. అయితే ఈ విషయంలో బోర్డు పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ వరకు వాళ్ళిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడతారని బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇటీవల స్పష్టం చేశారు. కొత్త కెప్టెన్ ను వన్డే క్రికెట్ కి ఎంపిక చేసే ఆలోచన చేయవద్దని సెలెక్టర్లకు బోర్డు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శర్మనే వన్డే క్రికెట్ కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వాళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో బోర్డుపై విమర్శలు వేడి పెరిగింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో మ్యాచులు జరిగితే వాళ్ళిద్దరిని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు. వాళ్ళిద్దరూ లేకపోతే అది, బోర్డు ఆదాయంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. అందుకే అన్ని ఆలోచించిన బీసీసీఐ పెద్దలు ఈ విషయంలో సెలెక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం.







