Rohith Sharma: అభిమానులకు రోహిత్ మరో షాక్..?
దాదాపు 15 ఏళ్ల నుంచి భారత క్రికెట్ లో కీలకంగా మారిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇటీవల టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలం కావడంతో వీళ్ళిద్దరిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. త్వరలో ప్రారంభం కాబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేందుకు బోర్డు పెద్దలు సిద్ధం కావడంతోనే వీళ్లిద్దరూ రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో బోర్డు పెద్దలు ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వినిపించాయి.
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో రోహిత్ శర్మ పై ప్రశంసలు వచ్చినా రెడ్ బాల్ క్రికెట్ విషయంలో మాత్రం అతనిపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. ఇక ఇప్పుడు వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ తప్పు కునే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. 2027 ప్రపంచ కప్ మీద దృష్టిపెట్టిన బోర్డు పెద్దలు.. రోహిత్ శర్మ విషయంలో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అతన్ని వన్డే కెప్టెన్ గా కూడా పక్కన పెట్టాలని.. పూర్తిస్థాయిలో వైట్ బాల్ క్రికెట్ కు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ను కెప్టెన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
దేశవాళి క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ సీజన్ లో కూడా అతను మెరుగ్గా రాణించాడు. తాజాగా జరిగిన ముంబై t20 లీగ్ లో కూడా అతను మంచి ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ లో అతని ప్రదర్శన ఆటగాడు గానే కాకుండా కెప్టెన్ గా ఎంతగానో మైమరిపించింది. దీనితో అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపడితే మంచి ఫలితం ఉంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. రాబోయే వరల్డ్ కప్ విషయంలో ప్రస్తుత జట్టు యాజమాన్యం కాస్త సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. అందుకే ఆలస్యం చేయకుండా జట్టు బాధ్యతలను అయ్యర్ చేతిలో పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు బోర్డు పెద్దలు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉండొచ్చని సమాచారం.







