విపక్ష నేత పదవికి సునాక్ గుడ్‌బై
బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ తన జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పార్లమెంటులో ప్రకటించారు. రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా అంటూ హాస్యం చిలికించారు. ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది అన్నారు.






