Ind vs Eng: ధోనీ, రోహిత్ రికార్డులు బ్రేక్ చేసిన పంత్..!

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు 471 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 359 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు తొలి సెషన్ లో కాస్త పర్వాలేదు అనిపించింది. కెప్టెన్ గిల్(Shubhaman Gill) నిదానంగా ఆడినా వైస్ కెప్టెన్ పంత్(Rishab Pant) మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేసాడు. సిక్సులు, ఫోర్లు, డిఫెన్స్ తో అలరించాడు. ఇక గిల్ మాత్రం 147 పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు.
ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. 8 ఏళ్ళ తర్వాత తొలి టెస్ట్ ఆడిన కరుణ్ నాయర్.. ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి భారత్ క్రమంగా వికెట్ లు కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్ లో పంత్ ఆట హైలెట్ గా నిలిచింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 65 పరుగులతో అజేయంగా నిలిచిన రిషబ్ పంత్ తన 7వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఎంఎస్ ధోనిని అధిగమించాడు.
తొలి టెస్ట్ మ్యాచ్ 2వ రోజున పంత్ ఈ ఘనత సాధించాడు. 2014లో భారత మాజీ కెప్టెన్ ధోని తన ఆరవ, చివరి టెస్ట్ సెంచరీ సాధించాడు. ఇక వేగంగా మూడు వేల పరుగులు చేసిన భారత కీపర్ గా కూడా పంత్ నిలిచాడు. మొదటి రోజు పంత్, రోహిత్ శర్మను అధిగమించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత్ తరపున అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు, పంత్ 56 సిక్స్ లతో రోహిత్‌తో సమంగా ఉన్నాడు. పంత్ 1వ రోజు రెండు సిక్స్ లు కొట్టి రోహిత్‌ను అధిగమించాడు.
54 మ్యాచ్‌లలో 83 సిక్స్ లు కొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తర్వాత పంత్ ఉన్నాడు. ఇక పంత్ తన ఇన్నింగ్స్ లో ఆడిన షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన సహజ శైలిలో ఆడిన షాట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇదే సమయంలో భారత మాజీ దిగ్గజ క్రికెటర్.. సునీల్ గవాస్కర్ పంత్ ను ఉద్దేశించి సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్ అంటూ కీర్తించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ చెత్త షాట్ ఆడి అవుట్ అయిన సందర్భంగా.. స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.