Ind vs Eng: క్రికెట్ ప్రపంచాన్ని ఫిదా చేసిన పంత్
                                    రిషబ్ పంత్(Rishabh Pant)” ఇప్పుడు ఈ పేరు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. అత్యంత ప్రమాదకర ఆటగాడిగా టెస్ట్ క్రికెట్ లో దూసుకుపోతున్న పంత్, ఇంగ్లాండ్ జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో ఓ రకంగా వీరోచిత పోరాటమే చేసాడు. తొలి రోజు బ్యాటింగ్ చేస్తూ గాయపడిన ఈ ఢిల్లీ ఆటగాడు, రిటైర్డ్ హర్ట్ గా మైదానం నుంచి వైదొలిగాడు. రెండవ రోజు బ్యాటింగ్ కు రావడం కష్టమని భావించిన అభిమానులకు, మాజీ ఆటగాళ్లకు పంత్ షాక్ ఇచ్చాడు. శార్దుల్ ఠాకూర్(Shardul Thakur) వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చాడు పంత్.
నడవడం కూడా కష్టంగా ఉన్న సమయంలో స్కోర్ పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేసాడు. నిన్న 37 పరుగుల వద్ద మైదానాన్ని వీడిన పంత్.. ఓ సిక్స్, ఫోర్ కొట్టాడు. 54 పరుగుల వద్ద పంత్.. ఆర్చర్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఇక పంత్ క్రీజ్ లోకి వచ్చే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఆఖర్లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన పంత్.. 9వ వికెట్ గా వెనుతిరిగాడు. గురువారం మైదానంలోకి వచ్చే ముందు.. జాగ్రత్తగా మూన్ బూట్ (ప్రొటెక్టివ్ ఆర్థోపెడిక్ బూట్) కూడా ధరించాడు.
అతను మైదానంలోకి అడుగుపెట్టే ముందు శార్దుల్ ఠాకూర్.. పంత్ ను దీవించాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండవ ఇన్నింగ్స్ లో కూడా పంత్ బ్యాటింగ్ చేసే అవకాశం కనపడుతోంది. పంత్ ఒకవేళ సీరీస్ నుంచి తప్పుకుంటే అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ధృవ్ జురెల్ కు కూడా అవకాశం కల్పించవచ్చు. ఇదే సమయంలో మరో కీపర్ ను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. పంత్ గాయం నుంచి కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతోందని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా పంత్ పట్టుదల మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.







