Delhi: జాగో ఇండియా జాగో.. ట్రంప్ టారిఫ్ లపై రఘురామ్ రాజన్ సూచన..

ట్రంప్ (Trump) టారిఫ్ లు భారత్ కు వేకప్ కాల్ లాంటిదన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ (Raghurama Rajan). ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పడానికి ఇది ఓ నిదర్శనమన్నారు రఘురామరాజన్.అమెరికా ప్రభుత్వం.. భారతీయ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఈ పరిణామం మన కళ్లు తెరిపించాలి. మనం ఏ ఒక్క దేశంపై అతిగా ఆధారపడకూడదు. తూర్పు దేశాలు, యూరప్, ఆఫ్రికా వైపు కూడా దృష్టి సారించాలి. అమెరికాతో వాణిజ్యం కొనసాగిస్తూనే, మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన 8 నుండి 8.5 శాతం వృద్ధిని సాధించేందుకు సంస్కరణలను వేగవంతం చేయాలి” అని రఘురామ్ రాజన్ సూచించారు.
ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. “ఇతర ఆసియా దేశాలకు చాలా తక్కువ బేస్ టారిఫ్‌లు ఉండగా, భారత్‌కు మాత్రం 50 శాతం బేస్ టారిఫ్ నిర్ణయించారు. ఇది మనకు నష్టదాయకమైన అంశం. దీనిని బట్టే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతగా క్షీణించాయో అర్థం చేసుకోవచ్చు” అని రాజన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా విధానాన్ని విశ్లేషిస్తూ, “వాణిజ్య లోటు ఉంటే, ఇతర దేశాలు అమెరికాను మోసం చేస్తున్నాయని ఆయన భావిస్తారు. తక్కువ ధరలకు వస్తువులు పంపడం వల్ల అమెరికా వినియోగదారులకు మేలు జరుగుతుందనే విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోరు” అని తెలిపారు. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుందని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “అవును, ఇందులో ఎలాంటి సందేహం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.