PM Narendra Modi: సైప్రస్ చేరుకున్న భారత ప్రదాని మోదీ
మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భారత్ నుంచి సైప్రస్ వెళ్లారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఇది ఆయనకు తొలి అంతర్జాతీయ పర్యటన కావడం విశేషం. ఈ ఐదు రోజుల పర్యటనలో మోడీ సైప్రస్, కెనడా, క్రొయేషియాలను సందర్శించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీని అక్కడి రాష్ట్రపతి నికోస్ క్రిస్టోడొలైడ్స్ ఘనంగా ఆహ్వానించారు. 23 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి సైప్రస్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సైప్రస్ నేతలతో వాణిజ్యం, రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధనాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తదితర కీలక అంశాలపై మోడీ (PM Narendra Modi) చర్చలు జరపనున్నారు.
సైప్రస్ పర్యటన ముగిసిన అనంతరం జూన్ 15, 16 తేదీల్లో కెనడా వెళ్లి అక్కడ జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. వరుసగా ఆరోసారి మోదీ ఈ అంతర్జాతీయ వేదికపై పాల్గొనబోతుండడం గమనార్హం. ఈ సమావేశంలో ఇంధన భద్రత, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలకు సంబంధించిన ప్రాధాన్యతలపై తన అభిప్రాయాలను ప్రపంచ నేతలతో మోదీ (PM Narendra Modi) పంచుకోనున్నారు. అదేవిధంగా పలు దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ పర్యటనలో చివరి విడతగా, జూన్ 18న క్రొయేషియాకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం మరో ప్రత్యేకత. క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకొవిక్తో ఆయన కీలక చర్చలు నిర్వహించనున్నారు. జూన్ 19న మోదీ (PM Narendra Modi) స్వదేశానికి తిరిగి రానున్నారు.







