Nobel Prize : నోబెల్‌కు ట్రంప్ ప్రతిపాదన సరికాదు… ప్రతిపక్షాల విమర్శ

ఇరాన్‌లోని అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నకు నోబెల్ పురస్కారం (Nobel Prize) ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని, దానిని పునపరిశీలించాలని పాక్‌లోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ (Pakistan) 2026 నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ పేరును ప్రతిపాదించిన మర్నాడే అమెరికా (America) ఈ దాడులు చేయడం గమనార్హం. భారత్-పాక్ సంఘర్షణల నేపథ్యంలో శాంతి స్థాపనకు ప్రయత్నించారంటూ పాక్ ప్రభుత్వం ఈ నెల 20న ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ (Ishaq Dar) సంతకాలు చేసిన సిఫార్సు లేఖను నార్వేలోని కమిటీకి పంపారు. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై బాంబుదాడులు చేసిన తర్వాత పాక్‌లో ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాక్‌లోని జమాయత్ ఉలేమా ఇ ఇస్లాం పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఈ నిర్ణయాన్ని పున పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.