Heart Attack: ప్రతి గుండెపోటు ఛాతీ నొప్పితో ప్రారంభం కాదు

ఈ రోజుల్లో గుండెపోటు ఆందోళన కలిగిస్తోంది. గతంలో చిన్న వయసు వారికి వచ్చే అవకాశం లేదనే భావన ఉండేది. చిన్న వయసులో ఉన్న వారికి గుండెపోటు వచ్చినట్టు కూడా మనం ఎక్కడా వార్తలు చూడలేదు. కాని ఇప్పుడు 30, 20 ఏళ్ళ లోపు వాళ్లకు కూడా గుండెపోటు వస్తోంది. దీనిపై ప్రముఖ వైద్యులు జాగ్రత్తగా ఉండాలని, పలు సూచనలు చేస్తున్నారు. రాజ్‌కోట్ లోని హెచ్‌సిజి హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్(cardiologist) డాక్టర్ దినేష్ రాజ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
చాతిలో ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా సరే లైట్ తీసుకోవద్దని కోరారు. చాతిలో మంటగా ఉన్న అనుభూతి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉంటె జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని కోరారు. పొట్టలోని ఆమ్లాలు బయటకు వచ్చినా, గ్యాస్ సమస్యలు ఉన్నా సరే ఛాతిలో మంట ఉంటుందని, వాటిని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు అని, అది కరెక్ట్ కాదన్నారు. ప్రతి గుండెపోటు ఛాతీ నొప్పితో ప్రారంభం కాదనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని సూచించారు.
చాలా మంది బాధితులు, ముఖ్యంగా మహిళలు, 50 ఏళ్లలోపు వారు చిన్న చిన్న లక్షణాలను అనుభవిస్తారని, కొన్ని సిగ్నల్స్ ను ముందే గుర్తిస్తే మంచిది అన్నారు. ఛాతిలో అసౌకర్యంగా ఉండటం(chest pain) లేదా బిగుతుగా అనిపించడం, చేయి, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపించే నొప్పి, శ్వాస ఆడకపోవుట, అలసటగా ఉండటం, చలిగా ఉంటూనే చెమటలు పట్టడం, తల తిరుగుతున్న భావన, తేలికగా బరువుగా అనిపించడం, అది వస్తూ పోతూ ఉండటం వంటివి ప్రమాదమని, నొప్పి ఎప్పుడూ ఉండదు కాబట్టి ప్రమాదకరం కాదు అనే భావనలో ఉంటారని, అది కరెక్ట్ కాదన్నారు. తగినంత నిద్ర లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఆయిల్ ఫుడ్స్ తినడం వంటివి సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరించారు.