ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక
రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్‌పై యుద్దం చేయానికి వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల శవాలు బ్యాగుల్లో తిరిగి వారి స్వదేశానికి తరలివెళతాయని ఐక్యరాజ్యసమితిలోని అమెరికా ఉప రాయబారి రాబర్ట్ వుడ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయన మాట్లాడుతూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 10 వేల మంది సైనికులను మాస్కోకి కిమ్ పంపినట్లు అమెరికా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. పాశ్చాత్య దేశాలు కీవ్‌కు సాయం అందిస్తున్నప్పుడు మాస్కోకు ఉత్తర కొరియా వంటి మిత్రదేశాలు సాయం అందించడంతో తప్పు ఏముందని ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కీవ్ ఐరాస రాయబారి సెర్గీ కిస్లిట్యా స్పందించారు. ఉక్రెయిన్‌కు సహాయం అందించే దేశాలు భద్రతామండలి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని అన్నారు.






