Pakistan : పాకిస్థాన్‌పై అమెరికా ట్రావెల్ బ్యాన్ ?

దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan) , అఫ్గానిస్థాన్‌ల (Afghanistan)పై ట్రావెల్ వ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికా (America)లోకి అనుమతించడంపై నిషేధం విధించారు. అనేక పరిశీలనల అనంతరం 2018 అక్కడి సుప్రీంకోర్టు (Supreme Court) ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ సర్కార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది.
అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతకు ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారం పాక్షికంగా, పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించి మార్చి 12లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో అఫ్గానిస్థాన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. ఈ జాబితాలో పాకిస్థాన్‌నూ చేర్చనున్నట్లు సమచారం.