ఎన్కెఫలైటిస్ వైరస్‌తో… అమెరికాలో
దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈస్ట్రన్ ఎక్వైన్ ఎన్కెఫలైటిస్ వైరస్ (ఈఈఈవీ) బారినపడి అమెరికాలోని న్యూ హ్యాంప్ షైర్లో ఒక వ్యక్తి మరణించాడు. ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఈ ఇన్ఫెక్షన్ తొలిసారి వెలుగు చూసింది. బాధితుడు నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలతో ఇటీవల ఆసుపత్రిపాలయ్యాడు. ఇది అరుదైన ఇన్ఫెక్షన్. ఈ వైరస్ బారినపడిన వారిలో మూడో వంతు మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కోలుకున్నవారి లోనూ జీవితాంతం మానసిక, శారీరక సమస్యలు తలెత్తవచ్చు. ఈ రుగ్మతకు టీకా లేదా యాంటీవైరల్ చికిత్స లేదు. అమెరికాలో ఏటా సగటున 11 మంది దీని బారినపడుతుంటారని సెంటర్ ఫర్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. న్యూహ్యాంప్ షైర్లో 2014లో ముగ్గురికి ఈ వైరస్ సోకిందని, వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.






