అధ్యక్ష ఎన్నికల తర్వాత… అమెరికాలో
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత హింసాత్మక ఆందోళనలకు రష్యా, ఇరాన్ కుట్ర పన్నాయని నిఘా అధికారులు హెచ్చరించారు. ఈ రెండు దేశాలు కోవర్టు ఆపరేషన్ల ద్వారాగానీ, స్థానిక గ్రూపులకు సహాయం చేయడం ద్వారా గానీ ఆందోళనలకు సహకరించవచ్చని జాతీయ నిఘా డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. విభజనను ప్రోత్సహించడం, ఎన్నికల ఫలితాలపై అనుమానాలను రేకెత్తించడం, అధికార మార్పిడికి అవాంతరాలు సృష్టించడం వంటివి అందులో ఉన్నాయని తెలిపింది. అమెరికాలో ఆందోళనలను నిర్వహించేందుకు అమెరికన్ను నియమించుకునే చర్యలను గత జనవరిలో రష్యా సైనిక నిఘా విభాగం చేపట్టిందని వివరించింది. అయితే అతడికి ఆ విషయం తెలియదని, రష్యా ఏజెంట్లతో అతడు కాంటాక్టులో ఉన్నాడో లేదో తెలియదని డైరెక్టరేట్ విడుదల చేసిన రహస్య డాక్యుమెంట్లలో ఉంది.






