Miss World: మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ (Miss England Milla Magee) తప్పుకున్నారు. తప్పుకోవడానికి ఆమె సంచలన కారణాలు చెప్పారు. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మిస్ వరల్డ్ పోటీలు మే 7న హైదరాబాద్ (Hyderabad) లో ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వరకూ జరగనున్నాయి. మిల్లా మాగీ కార్న్ వాల్‌కు చెందిన లైఫ్‌గార్డ్ పోటీల మధ్యలోనే మే 16న యూకేకి తిరిగి వెళ్లిపోయారు. తప్పుకోవడానికి ఆమె చెప్పిన కారణాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. దీంతో ఈ అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
మిల్లా మాగీ మొదట్లో తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలు అని చెప్పింది. అయితే ఆ తర్వాత ది సన్‌తో జరిపిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పోటీల సంస్థాపకులు తమను “వేశ్యలా” (Prostitute) భావించేలా చేశారని, పోటీదారులను గౌరవించకుండా “షో పీస్”లా (Show Piece) ప్రదర్శించారని ఆరోపించారు. పోటీదారులు ఉదయం నుంచి రాత్రి వరకు భారీ మేకప్, ఈవెనింగ్ గౌన్లు ధరించి ధనవంతులైన స్పాన్సర్లను ఆకర్షించేందుకు పరేడ్‌లా ప్రదర్శించారని ఆమె చెప్పారు. CPR వాటిపై తాను అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు, నిర్వాహకులు ఆసక్తి చూపలేదని ఆమె ఆరోపించారు. కేవలం ఆమె రూపాన్ని మాత్రమే ప్రదర్శించేందుకు ఒత్తిడి చేశారని చెప్పారు. ఈ పోటీ తమను అగౌరవంగా, వస్తువులా భావించేలా చేసిందన్నారు. నీతిలేని వ్యవస్థ గా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మిల్లా మాగీ నిష్క్రమణ తర్వాత మిస్ ఇంగ్లండ్ రన్నరప్ అయిన 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్ ఆమె స్థానంలో హైదరాబాద్‌కు చేరుకుని పోటీలో ఇంగ్లండ్‌ను ప్రాతినిధ్యం వహిస్తోంది. మిస్ వరల్డ్ నిర్వాహకులు మిల్లా మాగీ ఆరోపణలను ఆధారరహితమని, పూర్తిగా కల్పితం అని కొట్టిపారేశారు. ఆమె నిష్క్రమణకు ఆరోగ్య సమస్యలే కారణమన్నారు. అయితే, మిల్లా ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కొందరు X వినియోగదారులు ఈ పోటీలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పాన్సర్ చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ వివాదం మిస్ వరల్డ్ పోటీల చుట్టూ ఉన్న ఇతర సమస్యలను కూడా లేవనెత్తింది. రామప్ప ఆలయ సందర్శన సందర్భంగా స్థానిక మహిళలు పోటీదారుల పాదాలను కడిగిన ఘటనపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. దీనిని అగౌరవంగా భావించారు. మిల్లా ఆరోపణలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పోటీల నిర్వహణ, మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల అనే ప్రశ్నలను లేవనెత్తాయి.
మిస్ వరల్డ్ పోటీలు సాంప్రదాయకంగా అందం, ధైర్యం, సామాజిక కారణాల ప్రచారాన్ని జరుపుకుంటాయి. ఈ సంవత్సరం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో 108 మంది పోటీదారులు బస చేస్తూ.. శిల్పారామం, విక్టోరియా మెమోరియల్ హోమ్ వంటి స్థలాలను సందర్శించారు. తెలంగాణ సంస్కృతిని అనుభవించారు. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్, టాలెంట్ కాంపిటీషన్ వంటి ఈవెంట్‌లు పోటీదారుల సామాజిక అవగాహన, ప్రతిభను ప్రదర్శించాయి. అయితే, మిల్లా మాగీ నిష్క్రమణ ఈ పోటీల నీతిపై, స్త్రీల గౌరవంపై ప్రశ్నలను లేవనెత్తింది.
మిల్లా మాగీ, ఒయాసిస్ బ్యాండ్‌తో సంబంధం ఉన్న కత్రినా రస్సెల్ కుమార్తె. CPR అవగాహన కార్యక్రమం ద్వారా సామాజిక మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో పోటీల్లో పాల్గొన్నారు. కానీ ఆమె అనుభవాలు ఆమె ఆశలను పోటీలు నీరుగార్చాయని భావిస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో అందాల పోటీల ఔచిత్యం, నిర్వహణ, మహిళల పట్ల వ్యవహరించే తీరుపై మరోసారి చర్చను రేకెత్తించింది.