కేఎల్ రాహుల్… యూ బ్యూటీ, బ్యాటింగ్ టెక్నిక్ కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్
ఆసియా పిచ్ లకు సేనా పిచ్ లకు చాలా తేడా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మైదానాల్లో బ్యాటింగ్ చేయడం అంటే సవాల్ తో కూడుకున్నది. ఊహించని బౌన్స్, స్వింగ్ దానికి తోడు బంతి గమనంపై ప్రభావం చూపే గాలి. ఇలా ఎన్నో కఠిన పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్ళు అక్కడ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మైదానాల్లో బ్యాటింగ్ అంటే సవాల్ అనే చెప్పాలి. దానికి తోడు భీకర బౌలింగ్ లైనప్. సొంత మైదానాలు అక్కడి బౌలర్లకు కొట్టిన పిండి.
పెర్త్ ఆస్ట్రేలియా పేసర్లకు స్వర్గధామం. అలాంటి పిచ్ పై కొత్త బంతితో 20 బంతులు ఆడటం కూడా సాహసమే. కాని కెఎల్ రాహుల్ మాత్రం ఒక్కడే 12 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలింగ్ కు కొరకరాని కొయ్యగా మారాడు. బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేసినా… రాహుల్ మాత్రం ఎక్కడా టెంప్ట్ అవ్వలేదు. చివరకు అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. రాహుల్ ఆడిన 74 బంతులు చూస్తే అసలు ఎక్కడా కూడా అతను ఆస్ట్రేలియాకు అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ ఆడాడు. ప్రతీ బంతిని కరెక్ట్ గా అంచనా వేసాడు.
చేసింది 26 పరుగులే… కాని సెంచరీని మించి చేసిన పరుగులు అవి. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తం 85 బంతులు ఓ లైఫ్ సహాయంతో ఆడితే.. కెఎల్ రాహుల్ ఒక్కడే 74 బంతులు ఆడాడంటే అతని బ్యాటింగ్ టెక్నిక్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొత్త బంతిని భారత్ లో ఎంత అర్ధం చేసుకుంటాం అనేది కాదు… ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎంత అర్ధం చేసుకుంటామనే దానిపైనే భారీ ఇన్నింగ్స్ లు ఆధారపడి ఉంటాయి. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ టెక్నిక్ చూస్తే… ఓవర్సీస్ పిచ్ లపై అతనికి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుంది. ఆడినంత సేపు రాహుల్ ఎక్కడా కంగారు పడలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కంగారు పడినా… రాహుల్ మాత్రం టెంప్ట్ కాలేదు.






