దానికి అమెరికానే బాధ్యత వహించాలి : ఇరాన్
నెతన్యాహు సర్కారు తమపై ప్రతీకార దాడులకు పాల్పడితే దానికి అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయూద్ ఇరావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్, భద్రతా మండలి స్విస్ ప్రెసిడెన్సీలకు లేఖ రాశారు. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడుల ప్రణాళికపై తనకు అవగాహన ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అమీర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమపై ఇజ్రాయెల్ చేసే చట్టవిరుద్ధమైన సైనిక దురాక్రమణపై అమెరికా మౌనంగా ఉంటుందంటే ఆ దేశానికి మద్దతివ్వడమే అవుతుంది. బైడెన్ తాజా ప్రకటన తీవ్ర ఆందోళనకరమైనది. రెచ్చగొట్టే విధంగా ఉంది. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసే దురాక్రమణ చర్యలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఇరావని ఆ లేఖలో పేర్కొన్నారు.






