Indian Army: భారత సైన్యంలో బలమైన మార్పులు.. బరిలోకి రుద్ర ఆల్‌ఆర్మ్స్ బ్రిగేడ్, భైరవ లైట్ కమాండో బెటాలియన్లు

రుద్ర ఆల్‌ఆర్మ్స్ బ్రిగేడ్, భైరవ లైట్ కమాండో బెటాలియన్లు భారత సైన్యం (Indian Army)లో భారీ మార్పులను సూచిస్తున్నాయి. ఒకే రకమైన ఆయుధాలతో వేల మంది యుద్ధం చేయడం కంటే..తక్కువ మంది సైనికులు విభిన్న ఆయుధాలు, టెక్నాలజీలతో ఏకకాలంలో సమష్టిగా శత్రువుపై విరుచుకుపడేలా వీటిని రూపొందించారు. చైనా(China), పాక్‌తో ఘర్షణల అనంతరం భారత సైన్యంలో శరవేగంగా చోటు చేసుకొంటున్న మార్పులకు ఇవి చిహ్నంగా చెప్పవచ్చు..
సైనిక చర్యలు చేపట్టాలంటే పదాతి దళాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని శతఘ్ని, సాయుధ వాహనాలు, సిగ్నల్స్,ఎయిర్ డిఫెన్స్ ఇలా పలు యూనిట్లను సిద్ధం చేసుకోవడానికి.. వాటిని సరిహద్దులకు చేర్చడానికి రెండు మూడు వారాల నుంచి నెలల సమయం పడుతోంది. ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో చాలా జాప్యం జరిగింది. శత్రువు తాపీగా మన కదలికలను తెలుసుకొందనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో బ్రిగేడ్ స్థాయిలో అన్ని రకాల వనరులతో సైన్యం సిద్ధంగా ఉండేందుకు వీలుగా వీటిని ప్రతిపాదించారు.
ఏమిటీ రుద్ర బ్రిగేడ్..?
ప్రస్తుతం ఉన్న రెండు ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్లను ‘రుద్ర’గా మార్చాలని నిర్ణయించారు.మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ, ట్యాంకులు, శతఘ్నులు, ప్రత్యేక దళాలు, మానవ రహిత విమానాలు, ప్రత్యేకమైన లాజిస్టిక్స్ వ్యవస్థలు, కాంబాట్ సపోర్ట్‌తో వీటిని సిద్ధం చేస్తున్నారు. రుద్ర బ్రిగేడ్‌లు మోహరించే ప్రదేశాల భౌగోళిక పరిస్థితులు, ఆపరేషన్ల ఆధారంగా.. వీటిల్లో వచ్చే బలగాల సమ్మేళనం మారుతుంటుంది. సాధారణంగా వీటిల్లో శతఘ్నులు, డ్రోన్ల నిఘా ఉండటంతో.. ఇవి మన సేనలకు ఆధిపత్యాన్ని ఇస్తాయి. తీవ్ర స్థాయిలో జరిగే స్వల్పకాలిక ఘర్షణలు ఎదుర్కోవడంలో ఇటువంటి బ్రిగేడ్లు ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు పంచుకొనే పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో వీటిని మోహరించవచ్చు. పాక్ దుందుడుకు చర్యలకు వెంటనే సమాధానం చెప్పొచ్చు.
భైరవ లైట్ కమాండో బెటాలియన్లు ఏమిటీ..?
చురుగ్గా సరిహద్దుల్లో మోహరించడానికి.. మెరుపు వేగంతో దాడులు చేయడానికి వీలుగా భైరవ కమాండో బెటాలియన్లు ఏర్పాటు చేసింది. తక్షణమే చేపట్టే టాక్టికల్ ఆపరేషన్స్‌పై భైరవ బెటాలియన్స్ దృష్టిపెడతాయి. సైనిక చర్యకు సర్వసన్నద్ధంగా ఉంటాయి.
భవిష్యత్తు యుద్ధాల కోసం..
భవిష్యత్తు యుద్ధాల కోసం భారత్ ఇప్పటికే డ్రోన్ ప్లాటూన్లను, లాయిటరింగ్ (గాల్లో తిరుగుతూ శత్రు లక్ష్యంపై దాడి చేసేవి) కమ్యూనిషన్లను, శతఘ్ని రెజిమెంట్లు ఏర్పాటు చేస్తోంది. దీనికి ‘దివ్యాస్త్ర ప్రోగ్రామ్’గా పేరు పెట్టింది. ఇక ప్రతిపాదిత ఐబీజీలు, ప్రారంభించిన రుద్ర, భైరవ యూనిట్లను భవిష్యత్తులో మెరుపు వేగంతో శత్రువుపై విరుచుకుపడేలా రూపొందిస్తున్నారు.
బిపిన్ రావత్ హయాంలో నాంది..
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ హయాంలో సైనిక సంస్కరణలు మొదలయ్యాయి. అప్పుడే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ (ఐబీజీ)లను ఏర్పాటు చేయాలనే ఆలోచన రూపొందింది. దీనిలో ఇన్‌ఫాంట్రీతోపాటు.. శతఘ్ని, రాకెట్, సాయుధ కవచ, ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్ తదితర బలగాలు మొత్తం ఉంటాయి. ఇది బ్రిగేడ్ సైజ్(3,000) కంటే పెద్దదిగా.. డివిజన్ (10,000)సైజు కంటే చిన్నదిగా ఉంచాలని నిర్దేశించారు. మేజర్ జనరల్ స్థాయి అధికారి వీటికి నాయకత్వం వహిస్తారు. నిర్ణయాలు కూడా వేగంగా తీసుకొంటారు. కేవలం 12 నుంచి 48 గంటల్లో అవసరమైన ప్రాంతాల్లో మోహరించేలా ప్రణాళిక రూపొందించారు.