India :భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి అడ్డంకులు!
భారత్-అమెరికా (India-America) మధ్య వాణిజ్య ఒప్పందానికి కొన్ని అంశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అదనపు సుంకాలకు గడువుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయించిన జులై 8లోగా, మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కొన్ని కీలక అంశాలపై వాణిజ్య అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వారం ఢిల్లీ (Delhi)లో ఇరు దేశాలకు చెందిన మధ్యవర్తులు సమావేశమయ్యారు. భారత విపణిలోకి జన్యుపరంగా మార్పులు చేసిన ( జీఎం) పంటలను అనుమతించాలన్న అమెరికా (America) డిమాండ్‌తో పాటు ఇంకొన్ని అంశాలపై అనిశ్చితి నెలకొంది. వైద్య పరికరాలపై ధరల నియంత్రణ ఎత్తివేయాలని, సుంకాలను తొలగించాలని, డేటా స్థానికీకరణ విధానం నిబంధనల సడలించాలని అమెరికా పట్టుబడుతోంది. ఇందుకు భారత్ (India) సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం ఇవ్వాలని అమెరికా గట్టిగా కోరుతోంది. అయితే మన దేశంలో ఎక్కువ మందికి వ్యవసాయ రంగం జీవనోపాధిగా ఉంది. ఇక్కడ వ్యవసాయం వాణిజ్యంగా మారలేదు. మన దేశ ప్రజల అవసరాలను కాపాడాల్సి ఉంది అని ఒక ప్రభుత్వ అధికారి వెల్లడిరచారు.







