Delhi: సరిహద్దుల్లో నేపాల్ నక్కజిత్తులు.. భారత్ తీవ్ర అభ్యంతరం..

మిత్రదేశంగా ఉంటూనే నేపాల్.. భారత్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవలి కాలంలో చైనాతో అంటకాగుతున్న నేపాల్ నేతలు.. సరిహద్దుల్లో భారత్ భూభాగాలను తమవిగా చూపిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగమని నేపాల్ మరోసారి పునరుద్ఘాటించింది. 2020లో ఆ ప్రదేశాలు తమవంటూ పార్లమెంటులో చట్టం చేసిన నేపాల్..మ్యాప్ లోనూ అలాగే చూపించింది.
భారత్- చైనా (India-China)ల మధ్య వివాదాలు పరిష్కరించుకునే దిశగా ఇరుదేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈక్రమంలో లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ (Nepal) అభ్యంతరం తెలిపింది. కాగా, భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ ఈవిషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టంచేసింది.
మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగమని నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి పేర్కొన్నారు. తమ మ్యాప్‌లోను ఇదే స్పష్టమవుతుందని వాదించారు. ఇప్పటికే ఈవిషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియజేశామన్నారు. భారత్- నేపాల్‌ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నేపాల్ వాదనలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ తీవ్రంగా స్పందించారు. ‘లిపులేఖ్ ద్వారా భారత్- చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, చాలా స్పష్టంగా ఉంది. లిపులేఖ్ ద్వారా మా వాణిజ్యం 1953లో ప్రారంభమై.. కొన్ని దశాబ్దాల పాటు సాగింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఇటీవల దానికి అంతరాయం కలిగింది. ఇప్పుడు తిరిగి దాన్ని ప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి’ అని పేర్కొన్నారు. నేపాల్ ప్రాదేశిక వాదనలను సమర్థించలేమన్నారు. దాని వాదనలపై ఎలాంటి చరిత్రాత్మక ఆధారాలు లేవన్నారు. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను తాము అంగీకరించబోమని ఉద్ఘాటించారు. ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపుయాదురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ 2020లో సరికొత్త మ్యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాటి కేపీ శర్మ వోలీ ప్రభుత్వం దీనిపై తీర్మానం చేయడంతో పాటు.. పార్లమెంటులో ఆమోదముద్ర కూడా వేసింది. అయితే భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. నేపాల్ వాటిని బేఖాతరు చేసింది.